మరో పక్షి కూత
ఈ పక్షిని చూసి పెట్టిన కూత,పెట్టుకున్న వాత
క్లిక్కు నొక్కక బ్లాగులన్నీ వెక్కి వెక్కీ ఏడ్చెను
కిక్కు ఎక్కక మందు బుడ్డీ పక్కు పక్కున నవ్వెను
ముక్క ఒక్కటి రాక పేక బొక్క పెట్టీ పోయెను
మొక్కు మొక్కీ కొండ ఎక్కిన రొక్క మేదని అడిగెను
లోతైన స్పందన
దానయ్య గారు ఓ సారి ఓ బ్లాగు రాసి ,రాసినవాళ్ళు రాసినట్టు ఊరుకోక పెద్దగా తలకాయ అంత అక్షరాలతో లోతయిన భావం ఉంది లోతుగా చూసి స్పందించండి అని ఒక నోట్ పెట్టారుట. అది చూసిన ఓ పెద్ద మనిషి ఇలా స్పందించాట్ట
బ్లాగుందని నే కూడలి కెళ్ళా
బాగుందని మీ లంకెను నొక్కా
ఏముందని మరి లోతుగ చూస్తే
ఏమందును అన్నీ ఒకట్లూ సున్నాలే
సింహాసనం
నొక్కుకి నోచుకోపోడం అంటే మరీ బొత్తిగా కాదనుకోండి , మొదట్లో దానయ్య గారి బ్లాగు కి క్లిక్కులు వచ్చేవి, వ్యాఖ్యలు కూడా వస్తూ ఉండేవి. ఇంకా కొంత మంది ఆసక్తి పరులు ఈయన బ్లాగుకి లింకులు కూడా పెట్టుకున్నారుట . దాంతో ఆనందం పట్టలేక దానయ్య గారికి ఏదో సింహాసనం ఎక్కినంత ఫీలింగ్ కలిగిందిట
క్లిక్కులు కరతాళ ధ్వనులై ప్రతిధ్వనించ
లింకులు పూల హారంబులై ఎదనలంకరించ
వ్యాఖ్యలే బహుపరాక్కులుగ మారుమ్రోగ
నే బ్లాగు సింహాసనం బధిష్టించితిన్ !
బ్లాగు చక్రం
హృదయ సంద్రమును స్పందనజ్వాలారశ్మి సోకగ
భావ జలంబు భాష్ప రూపమున అంబర మంటగ
బ్లాగు మేఘమై, నీ చల్లని క్లిక్కులు జిల్లున తాకగ
జల్లుల వెల్లువ ఘల్లని కురిసెను నా ఎద నిండగ
నిందా మొర – 2
టపా జూపు కొలమానము కాలమానమా
సాలెగూటి లోన కూడ సామ్యవాదమా
రమ్యమయిన బ్లాగు బ్రతుకు అధోలోకమా
నీడ లేని బ్లాగు తోడ క్రీడ లేల కూడలి!
గమనిక: ఇతివృత్త రీత్యా కేవలం హాస్యం కొరకు రాసినది తప్ప విమర్శించుటకు కాదని మనవి
వ(వ్య)ధ
కుడి మెదడున కదలాడిన సృజనాత్మక శిల్పం
తడి ఆరని పారాణి తొ నా తలపుల రూపం
మెడ కోసి తల చూపి కడతేర్చెను కూడలి గుమ్మం
సడి కోసం సందడి కోసం పడిగాపులు కాసెను దేహం
గమనిక: ఇతివృత్త రీత్యా కేవలం హాస్యం కొరకు రాసినది తప్ప విమర్శించుటకు కాదని మనవి
ట్రాఫిక్ జామ్
ఒక సారి దానయ్య గారికి ఒక విచిత్రమయిన కల వచ్చింది , కూడలి లో ట్రాఫిక్ జామ్ అయినట్లు
కలగంటి కలగంటి మెలకువగ కలగంటి
నా టపా ప్రచురించిన మరు నిముషము
కూడలి రాకపోకలు దిగ్బంధమయినటుల
నా టపా మూడు నాళ్ళు అగ్రస్థానమొందినటుల
కల చెదిరి కను తెరిచి చూసేసరికి విషయం అర్ధం అయ్యింది
కూడలి లో ట్రాఫిక్ జామ్ ఉండదని అక్కడకి చేరిన బండి రెట్టించిన వేగంతో ముందుకు
వెళ్ళడమే గాని అక్కడ ఒక్క నిముషం కూడా ఆగదని
దాంతో దానయ్య గారు గేరు మార్చి ఏమన్నారంటే
నీవు పైదారులు కట్టలేదు భూగ్రుహ దారులు త్రవ్వలేదు
ఇచట రక్షకభటులెవ్వరు కానరారు దీపమన్నదగుపించదు
అయినన్ నీ దిగ్బంధరహిత నియంత్రణ కడు విచిత్రముగనున్నదే
మా నగరపు కూడళ్ళు కూడ శక్తిమంతమాడి ముక్తి నొసగ రాదే
గమనిక: ఇతివృత్త రీత్యా కేవలం హాస్యం కొరకు రాసినది తప్ప విమర్శించుటకు కాదని మనవి
నిందా మొర
దానయ్య గారు తన బ్లాగుకి క్లిక్కులు రాకపోవడానికి గల కారణం గురించి ఎంతొ పరిశోధన చేసి చివరికి
తాను నిమిత్తమాత్రుడనని కేవలం కూడలి చేతిలో కీలుబొమ్మ అని గ్రహించి
ఒక్కసారి చెరసాల లో బంధించబడిన ఆ రామదాసు ని గుర్తుకు తెచ్చుకొని
మన కూడలి రాముడిని నిందిస్తూ ఈ విధంగా మొర పెట్టుకున్నారు
లంకంత కొంప పెట్టి లంకెలు చూపించలేక
లంకణాలు మేము జేసె నీ నొక్కులు తినిపించలేక
నొక్కులన్నినీవు పొంది నెప్పులను మాకు మిగుల్చు
టెక్కునిక్కుల క్రీడలు చాలించు కూడలీ !
గమనిక: ఇతివృత్త రీత్యా కేవలం హాస్యం కొరకు రాసినది తప్ప విమర్శించుటకు కాదని మనవి
ఉక్కు పాదం
అలా ఏడుపుల పరంపర కొనసాగుతూ ఉండగా
ఉక్కుపాదా వరప్రసాద మహిమాన్వితులైన దానయ్య గారు ఇలా వాపోయారు
నే స్టాకు క్రయించినన్ బజారంతనూ సామూహిక విక్రయమే
నే బ్లాగు లిఖించినన్ కూడలంతనూ ముద్రణల సముద్రమే
నేనేమి చేసినన్ అకటా! కడకు అధోగతీ వ్యవహారమే
వ్యాఖ్యలు (4)
వ్యాఖ్యలు (2)
వ్యాఖ్యానించండి